ప్రజల ముందుకు త్వరలో సమగ్ర నివేదిక
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కులగణనను విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులగణన జరగొద్దని అనేక కుట్రలు, తప్పుడు ప్రచారం చేసినా.. సర్వే విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించారన్నారు.
94 బ్లాకులుగా విభజించి కులగణన
రాష్ట్రాన్ని 94 బ్లాకులుగా విభజించి కులగణన చేశామని, లక్షకు పైగా ఎన్యుమరేటర్లు సర్వేలో పాల్గొన్నారని చెప్పారు. దశాబ్దాలుగా కొన్ని వర్గాలు ఎదురుచూస్తున్న కులగణనను పూర్తి చేసి చట్టసభలో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. సర్వేలో పాల్గొనని వారు.. ఇప్పుడు సమాచారం ఇచ్చినా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి సర్వే సమగ్ర నివేదికను ప్రజల ముందు ఉంచుతామన్నారు. సర్వే సక్సెస్ కావడానికి సహకరించిన ప్రజలకు, మీడియా, అధికారులకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.