బీఆర్ఎస్ హయాంలో పల్లెల రూపురేఖలు మారగా.. కాంగ్రెస్ పాలనలో చిమ్మచీకట్లలో మగ్గుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. వీధి దీపాల మరమ్మతులకు కూడా నిధులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా..?. పడకేసిన పారిశుధ్యంతో ప్రజలు రోగాలపాలు అవుతున్నారు. వీధి దీపాలు వెలగక పల్లెసీమలు చిమ్మ చీకట్లో మగ్గుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవు.. పంచాయతీ ట్రాక్టర్‌కు డీజిల్ పోసే దిక్కు లేదు. ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా..?
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో రుపురేఖలు మారాయి. నాడు పంచాయతీలకు ఠంచన్‌గా కడుపునిండా నిధులు వచ్చేవి. కాంగ్రెస్ వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చింది. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు అప్పులపాలు అయ్యారు. నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు కూడా తిప్పలు తప్పట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇకనైనా మొద్దునిద్ర వీడాలి.. గ్రామాల్లో సమస్యల పంచాయతీని తీర్చాలి” అని డిమాండ్ చేశారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదైంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావడం లేదు. దీంతో వీధి దీపాల మరమ్మతులకు కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం లేకపోవడంతో ప్రస్తుతం నిర్వహణ భారమంతా కార్యదర్శులపై పడటంతో పాలన పడకేసింది.