దేశంలోకి అక్రమంగా బంగారం వస్తూనే ఉంటుంది. విదేశాల నుంచి వినూత్న మార్గాల్లో గోల్డ్ స్మగ్లింగ్(Gold Smuggling) జరుగుతూనే ఉంటుంది. దొరికితే దొంగ.. దొరకపోతే దొర అన్నట్లు ఈ స్మగ్లింగ్ దందా నడుస్తుంది. ప్రజలకు డబ్బు ఆశ చూసి స్మగ్లర్లు ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారి ప్లాన్‌లు ఎయిర్‌పోర్టుల్లోనే బెడిసికొడుతుంది. కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో దొరికిపోతారు.
తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు(Delhi Airport)లో 10 కిలోల బంగారం పట్టుబడింది. ఇటలీలోని మిలాన్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కన్పించడంతో వారి బ్యాగేజీలను స్కాన్ చేశారు.అనంతరం వారిని తనిఖీ చేయగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్ట్‌లను గుర్తించారు. అందులో రూ.5 కిలోల చొప్పున వందలకొద్దీ బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 10.092 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.8 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.