మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే టీ20లకు మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్టోయినిస్ కూడా ఉన్నాడు. అయినా కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
అసలే మిచెల్ మార్ష్, జోష్ హజల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు స్టోయినిస్ కూడా తప్పుకోవడం కంగారులకు షాక్ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే 71 అంతర్జాతీగాయ వన్డే మ్యాచులు ఆడిన స్టోయినిస్ 1495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 74 అంతర్జాతీయ టీ20లు ఆడి 1245 పరుగులు నమోదుచేయగా.. ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్‌లోనూ 96 మ్యాచులు ఆడి 1866 పరుగులు చేయగా.. ఒక సెంచరీ, తొమ్మిది హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.