ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నట్లు ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఛార్జీలు పెంపుపై ప్రతిపక్ష వైసీపీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పష్టత ఇచ్చారు. ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్(AP Cabinet) భేటీలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. దీంతో ఛార్జీలు(Power Charges)పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే ఛార్జీలు తగ్గించాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సూచించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలు రాష్ట్రంలో వేగంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంపు ఇప్పట్లో లేనట్లే అని అర్థమవుతోంది.
మరోవైపు పలు నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు సమ్మతి తెలిపింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపులు, మద్యం ధరలు, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.