ఫిబ్రవరి 19న ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, హేజెల్‌వుడ్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం బాధాకర విషయమే అయినప్పటికీ.. ఇతర ఆటగాళ్లకు గొప్ప అవకాశం లాంటిదన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గత నెల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మార్ష్, స్టోయినిస్, హేజెల్‌వుడ్, కమిన్స్ పేర్లు ఉన్నాయి. ఇప్పడు ముగ్గురు ఆటగాళ్లు గాయం కారణంగా దూరమైతే.. స్టోయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నలుగురు కొత్త ఆటగాళ్లను ఆస్ట్రేలియా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏయే ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందో వేచి చూడాలి.