విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) రాజీనామాపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇప్పటివరకు బయటకు వెళ్లారని.. అయినా వైసీపీకి ఏం కాదన్నారు. రాజకీయాల్లో ఎవరికైనా క్యారెక్టర్ ఉండాలన్నారు. ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే వారు రాజకీయాల్లో పనికిరారు అని పేర్కొన్నారు. భయం, ప్రలోభాలకు లొంగి క్యారెక్టర్‌ను తగ్గించుకోవద్దని సూచించారు. సాయిరెడ్డికైనా, ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుందని తెలిపారు.
తాజాగా జగన్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. “వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా” అని ట్వీట్ చేశారు. మొత్తానికి మొన్నటిదాకా వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఇప్పుడు ఏకంగా అధినేత జగన్ వ్యాఖ్యలకే కౌంటర్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.