అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు అధికారం కోల్పోవడం.. మరోవైపు నేతలు రాజీనామాలు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్(Sailajanath) పార్టీలో చేరడం కాస్త ఊరటనిచ్చింది.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బగా ఆయనను పార్టీలోకి సాదరంగా జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కొందరూ జాయిన్ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పనితీరు నచ్చకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని శైలజానాథ్ అనుచరులు చెబుతున్నారు.
కాగా వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో శైలజానాథ్ పనిచేశారు. 2004, 2009ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం ఏపీసీసీ చీఫ్‌గా కొన్నాళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.