వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీని రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు విచారిస్తున్నారు. విచారణకు ముందు ఆర్జీవీని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ మంతనాలు జరిపారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై చర్చించారు.
కాగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్జీవీ రూపొందిచిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషనల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాని సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు ఆయనకు వాట్సాప్ ద్వారా మరోసారి నోటీసులు పంపించారు. అయితే 4వ తేదీన సినిమా షూటింగ్ కారణంగా బిజీగా ఉంటానని.. 7వ తేదీన విచారణకు వస్తానని ఆర్జీవీ సమాధానమిచ్చారు.