నటుడు సోనూసూద్(Sonu Sood)కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ ఉదయం నుంచి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఎక్స్ వేదికగా సోనూసూద్ క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా ఈ అంశాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు.
“నాకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. అందుకు మా న్యాయవాదులు స్పందించారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ స్పష్టంగా వివరిస్తాను. ఆ కేసుకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు. సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరం. పబ్లిసిటీ కోసం నా పేరును వాడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ట్వీట్ చేశారు.
కాగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించారని.. సోనూసూద్ సాక్షిగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించింది. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.