అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి, 2 దఫాలు ఢిల్లీని ఏలిన ముఖ్యమంత్రిగా వెలిగిన కేజ్రీవాల్ చివరికి ఓ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించలేకపోయారు. 1200 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు.
జెయింట్ కిల్లర్ గా పర్వేష్
బీజేపీ నేత, సీఎం రేసులో కూడా ఉన్న పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీ ఓడిపోయారు. కాగా ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మకు రాజధానిలో మంచి ఇమేజ్ కూడా ఉంది. కేజ్రీవాల్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా పర్వేష్ మారారు.
కేజ్రీవాల్ కు ఒకప్పుడు కుడి భుజం మనీష్
జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ నేతల్లో ఒకరైన మనీష్ శిసోడియా ఓటమిపాలయ్యారు. 900 ఓట్ల తేడాతో శిసోడియా ఓటమిపాలయ్యారు. అన్నా హజారే రోజుల నుంచి, ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి కేజ్రీవాల్ కు కుడి భుజంగా ఉంటూ, పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు మనీష్. కాగా అవినీతి ఆరోపణల్లో నెలలపాటు జైల్లో ఉన్న మనీష్ ఒకప్పుడు హిందీ జర్నలిస్ట్. జర్నలిజంలో భాగంగా కేజ్రీవాల్ తో ఆయనకు సాన్నిహిత్యం పెరిగి, ఢిల్లీ డిప్యుటీ సీఎంగా కూడా పనిచేశారు.
కేజ్రీవాల్-శిసోడియా ఇద్దరూ ఓటమిపాలుకాగా ఇంకా పలువురు ఆప్ నేతలు వెనుకంజలో ఉన్నారు.