పాకిస్థాన్ వేదికగా మరో 10 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈలోపే పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో ట్రైసిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం పాక్-కివీస్ మధ్య తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. పాక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర(Rachin Ravindra) తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర బాల్ ఆపబోయిన రవీంద్రకు బంతి సరిగ్గా కనిపించలేదు. దీంతో అతడి కంటి దగ్గర బంతి బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది.
వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. లాహోర్‌లోని గడాఫీ క్రికెట్ స్టేడియాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో రీమోడల్ చేశారు. అయితే ఇంకా కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లడ్ లైట్లు సరిగా పనిచేయకపోవడం కారణంగా రవీంద్ర బంతిని సరిగ్గా చూడలేకపోయాడని చెబుతున్నారు. ఫ్లడ్ లైట్ సమస్యలు, తయారీ లోపాలు వంటి అంశాలు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 330/6 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఫఖర్ జమాన్ 84 పరుగులతో రాణించాడు.