ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇండియా కూటమిలో పార్టీలు అన్ని తమకే కావాలని కోరుకుంటున్నాయని.. అదే పెద్ద సమస్యగా మారిందని విమర్శించారు. హర్యానాలో ఆప్ వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని ఢిల్లీలో కాంగ్రెస్ వల్ల ఆప్ ఓడిపోయిందన్నారు. అయితే చివరికి లబ్ధి పొందుతోంది మాత్రం బీజేపీనే అని పేర్కొన్నారు. అందుకే అందరూ కలిసి ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే అశించిన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.
ఒకే దేవం.. ఒకే ఎన్నిక.. ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ అనే విధానం ప్రధాని మోడీ రహస్య అజెండా అని రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని రేవంత్ పిలుపునిచ్చారు. .