తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్(MLC Nominations) గడువు నేటితో ముగియనుంది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది నుంరచి నామినేషన్లు వచ్చాయన్నారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, పీఆర్‌టీయూ, పీడీఎఫ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం.
అటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి 11 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులతో పాటు పీడీఎఫ్, స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక ఈనెల 11న అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 13 వరకు నామినేషన్లకు ఉప సంహరణకు అవకాశం ఉండగా.. 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తారు.