చిలుకూరు బాలాజీ(Chilukur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదిగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ధర్మరక్షకులు దాడులు చేస్తుంటే రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని విమర్శించారు. ఈ పిరికిపంద చర్యపై హిందూమత రక్షకుల నోట నుండి ఒక్క మాట కూడా రాలేదని బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఇది అవమానకరమని తెలిపారు. దీనిపై హోంమంత్రి, ముఖ్యమంత్రి వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు.
కాగా రెండు రోజుల క్రితం వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో రంగరాజన్ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించాడు. రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని కుమారుడిపై కూడా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగరాజన్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.