ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా ఇస్తారని రూల్స్ చెబుతున్నాయని సీఎం చంద్రబాబు(Chandrababu) ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయ్‌కాట్ చేసిన విషయం విధితమే. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) స్పష్టం చేశారు. అయితే తాజాగా దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ..జగన్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చిచెప్పారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు. స్పీకర్‌గా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనని.. అసెంబ్లీ, నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి నియోజకవర్గాలకు సంబంధించిన సమసల్యపై చర్చించాలని సూచించారు.