పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా (NZ vs SA) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ జట్టు.. అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని నమోదు చేశాడు. కాన్వే(97)తో కలిసి 187 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ పలు అరుదైన రికార్డులను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. డివిలయర్స్ తన కెరీర్‌లో 420 మ్యాచ్‌లు ఆడి 47 సెంచరీలు నమోదు చేయగా.. విలియమ్సన్ కూడా ఇప్పటివరకు 47 శతకాలు నమోదు చేశాడు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరమవుతున్న కేన్ మామ.. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముందు తిరిగి గాడిలో పడటం బ్లాక్ క్యాప్స్ జట్టుకు భారీ ఊరట అని చెప్పాలి.