చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్. శ్రీనివాస్ పలు విషయాలు తెలిపారు. ఈ అంశంపై డీసీపీ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రంగరాజన్ దాడిపై పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటన తనని కలిచివేసిందన్నారు.
ఈ కేసులో మెుత్తం 6 మంది అరెస్ట్
ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరు మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 5 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారుగా తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు
ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారని అన్నారు. అందుకు నిరాకరించడంతో రంగరాజన్‌పై దాడి చేశారని డీసీపీ మీడియాకు వివరించారు.
వీర రాఘవ రెడ్డి పూర్తి వివరాలు
2022 సంవత్సరంలో వీర రాఘవరెడ్డి రామరాజ్యంను స్థాపించాడని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశారని చెప్పొకొచ్చారు డీసీపీ శ్రీనివాస్. ఈ రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పారన్నారు. తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించి రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడని తెలిపారు. ఫిబ్రవరి 6న అందరూ యాప్రాల్‌లో కలిశారని డీసీపీ తెలిపారు.
రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటితో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం చేశారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో 25 మంది తన అనుచరులతో నల్ల దుస్తుల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేశారని డీసీపీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం అని డీసీపీ తెలిపారు.