ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela)కు వెళ్లిన కొందరు ఆంధ్రప్రదేశ్ వాసులు రోడ్డు ప్రమాదానికి(Road Accident) గురయ్యారు. పుణ్యస్నానం ఆచరించి తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా పరిధిలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ రహదారి పైకి ట్రక్కు రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు ఏపీలోని ఏ జిల్లాకు చెందిన వారో ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.