ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు(Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ స్నానం సందర్భగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు.ఈ సందర్భంగా పక్కనే ఉన్న కాశీ, అయోధ్యలకు కూడా లక్షలాది మంది భక్తులు వెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతగా అంటే దాదాపు 350 కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికల్ జోన్(No Vechicle zone)గా ప్రకటించింది. దీంతో పోలీసులు వాహనాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు.
మరోవైపు వచ్చే 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. భారీ ట్రాఫిక్ జామ్ దృష్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని దయచేసి ఆలోచించాలని సూచించారు. ఇక జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒక్క మౌని అమావాస్య రోజునే 15 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.