తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్‌కు బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా పూణె ల్యాబ్‌లో నిర్ధారణ అయింది. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫారంలో రోజుకు 10 వేలకు పైగా మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తరచూ కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తుండటంతో దీనిపై ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ ఉన్న కోడిని తింటే ఏమవుతుంది. మనుషులకు ఆ వైరస్ సోకితే చనిపోతారా ఇలా ఎన్నో ప్రశ్నలతో భయపడుతున్నారు. దీని గురించి ఈ కథనంలో పూర్తి సమాచారం తెలుసుకుందాం.
కోళ్ల వ్యాపారాన్ని తరచూ దెబ్బతీసే వైరస్ బర్డ్‌ఫ్లూ. దీనిని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని కూడా అంటారు. ఇదో రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పక్షులకు ఎక్కువగా సోకుతుంది. కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. బర్డ్ ఫ్లూ రావడానికి ముఖ్య కారణం ఇన్‌ఫ్లూయెంజా A వైరస్. వీటిలో చాలా రకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. H5N1, H7N9, H5N8 స్ట్రెయిన్ల వల్ల వ్యాధి వస్తుంది.
బర్డ్ ఫ్లూ అనేది అన్నిసార్లూ కోళ్లకు ప్రాణాంతకం కాదు. స్ట్రెయిన్‌ని బట్టి కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది. కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యం పాలవుతాయి. స్ట్రెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు.. కోళ్ల రెక్కలు సరిగా పెరగవు, గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది, కోళ్లు ఊపిరి సరిగా పీల్చుకోలేవు.
ఒక్కోసారి కోళ్లు వైరస్ నుంచి రికవరీ అయినా.. అప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే.. కోళ్లు కొన్ని గంటల్లోనే చనిపోతాయి. లేదా కొన్ని రోజుల్లో చనిపోతాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినప్పుడు.. వాటి తల ఉబ్బుతుంది. కాళ్లు, శరీరం పర్పుల్ కలర్‌లోకి మారుతుంది. కోళ్లు సరిగా ఊపిరి పీల్చుకోలేవు, డయేరియా వస్తుంది. దగ్గు, తుమ్ములు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే.. సడెన్‌గా చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో వైరస్‌ని కంట్రోల్ చెయ్యడానికి కోళ్ల ఫారంలోని అన్ని కోళ్లనూ చంపేస్తారు.
మనుషులకు బర్డ్ ఫ్లూ: ఈ వ్యాధి మనుషులకు అరుదుగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా, వండుకొని తిన్నా, సోకే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే.. అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ ఎగురుతూ ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినా వైరస్ వస్తుంది. కోడిని సరిగా ఉడకబెట్టకపోయినా, కోడి గుడ్లను సరిగా వంటకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.
మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రం అయితే, ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది, ఊపిరి సరిగా తీసుకోలేరు, ఊపిరితిత్తులు పనిచెయ్యవు, బ్రెయిన్ దెబ్బతింటుంది. మరణాల రేటు ఎక్కువే. H5N1 స్ట్రెయిన్ సోకితే.. చనిపోయే అవకాశం 50 శాతం ఉంటుంది. అయితే మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తినక పోవడం మంచిదని పలువురు చెబుతున్నారు.