ఇటీవల కామెడీకి హద్దుల్లేకుండా పోతున్నాయి. స్టాండప్ కామెడీ, లైవ్ కామెడీ అంటూ వావివరసలు లేకుండా సెటైర్లు వేస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రుల శృంగారం గురించి కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ఇదే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏకంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)తో సహా ప్రతిపక్షాలు కూడా అతడిపై విమర్శలు గుప్పించారు. వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగపరిచాడంటూ మండిపడ్డారు. మరోవైపు రణవీర్‌పై పలువురు నేతలు, కార్యకర్తలు కేసులు కూడా పెట్టారు. దీంతో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రణవీర్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ వివాదంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆ వీడియో తొలగించాలని యూట్యూబ్(YouTube) సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను తొలగిస్తూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని శివసేన(యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. కాగా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో ఇన్‌ఫ్లుయెన్సర్ రణవీర్ తల్లిదండ్రులు శృంగారం గురి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.