గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని తెలిపారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయిందన్నారు. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని చంద్రబాబు వెల్లడించారు.