సీనియర్ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prudhvi Raj) అస్వస్థతకు గురయ్యారు. హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే లైలా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడుతూ వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ(YCP) అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ఇలా ఉండగానే పృథ్వీ అస్వస్థతకు గురికావడం చర్చగా మారింది.
కాగా గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి పొందారు. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న పృథ్వీ జనసేనకు దగ్గరయ్యారు. సందర్భంగా దొరికినప్పుడల్లా వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.