కొంతకాలంగా ఈవీఎంల(EVM)పై అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిన పార్టీలు ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) మాత్రం ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యపడదని పలుమార్లు తేల్చి చెప్పింది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈసీకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఈవీఎంల డేటా ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని డేటాను తప్పకుండా భద్రపర్చాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. మరోవైపు ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ యూనిట్‌ను కనీసం 45 రోజుల పాటు భద్రంగా సీల్ చేయాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. ఇందుకయ్యే ఖర్చులను అభ్యర్థులే భరించాలని వెల్లడించింది.