కాళ్లకూరి నారాయణ రావు పేరు గుర్తుకు వస్తే చాలు ‘వర విక్రయం’, ‘చింతామణి’, ‘మధుసేవ’ వంటి అపూర్వ, అపురూప గ్రంథాలు గుర్తుకు వస్తాయి. ఆయన రచనలను బట్టి చూస్తే, తెలుగునాట అటువంటి అత్యుత్తమ రచయితే కాదు, అంత గొప్ప సంస్కర్త కూడా మరొకరు ఉండరనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం, మత్స్యపురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న బంగార్రాజు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించిన కాళ్లకూరి నారాయణ రావు బాల్యం నుంచే సాంఘిక దురాచారాల మీదా, మూఢ నమ్మకాల మీదా తిరగబడిన వ్యక్తి. సంఘ సంస్కరణాభిలాషతోనే ఆయన రాసిన చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) వంటి నాటకాలు ఆంధ్రనాట ఎంతో ప్రసిద్ధి చెందాయి. రాష్ట్రంలో ఈ నాటకాలను ప్రదర్శించని ఊరు ఉండదంటే ఆశ్చర్యం లేదు. ఈ నాటకాలలో హాస్య రసాన్ని పండిస్తూనే సమాజానికి, కులాలకు, దురాచారాలకు వేసిన చురకలు ఇప్పటికీ తెలుగు ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆయన 1919లో రాసిన ‘పద్మవ్యూహం) నాటకంలో పద్యాలను కూడా పొందుపరచడం విశేషం.
సమాజంలో వేళ్లు పాతుకుపోయి ఉన్న వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ ఆయన రాసిన ‘వర విక్రయం’ నాటకానికి దీటైన తెలుగు నాటకాన్ని ఇంతవరకూ ఎవరూ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి వేశ్యల తీరుతెన్నుల గురించి, గుట్టుమట్ల గురించి ఆ రసవత్తర నాటకంలో అద్భుతంగా బట్టబయలు చేశారాయన. ఇక ‘చింతామణి’ నాటకాన్ని ప్రదర్శించని నాటక సమాజమంటూ ఆంధ్రదేశంలో లేదు. అందులోని సంభాషణలు ఇప్పటికీ తెలుగువారి నాలుక మీద తాండవం చేస్తూనే ఉంటాయి. వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్న కాలంలో ఆయన చింతామణి నాటకాన్ని రాశారు. రాయడమే కాకుండా వీధి వీధినా ప్రదర్శించడం కూడా జరిగింది. ఇక ‘మధుసేవ’ అనే నాటకాన్ని ఆయన మధుపానానికి వ్యతిరేకంగా రాశారు. మద్యపాన సమస్యలను, అది సమాజాన్ని కబళించి, నాశనం చేస్తున్న తీరును ఆయన నభూతో న భవిష్యతి అన్నట్టుగా కళ్లకు కట్టించారు. మద్యపానం వల్ల చోటు చేసుకునే దుష్పరిమాణాలను ఇంతకంటే చక్కగా వెల్లడించిన నాటకం ఆ తర్వాత మరొకటి కనిపించదు.
ఇక చిత్రాభ్యుదయం, పద్మవ్యూహం, సంసార నటన వంటి నాటకాలు, కారణం లేని కంగారు, దసరా తమాషాలు, లుబ్ధాగ్రేసర చక్రవర్తి, రూపాయి గమ్మత్తు, ఘోరకలి, మునిసిపల్ ముచ్చట్లు, విదూషక కపటము వంటి ప్రహసనాలను కూడా రచించి తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన 1927 జూన్ 27న పరమపదించే నాటికి వర విక్రయం, చింతామణి వంటి నాటకాలను కొన్ని వేల సార్లు ప్రదర్శించి ఉంటారు.తేలికపాటి తెలుగు, సునిశిత హాస్యం, మంచి పట్టున్న ఇతివృత్తాలతో ఆయన ఆనాటి సమాజాన్ని తీవ్రస్థాయిలో ప్రభావితం చేశారు. దురాచారాలు, మూఢనమ్మకాలు, దుస్సంప్రదాయాలతో నిండిపోయిన సమాజాన్ని ఒక్క కుదుపు కుదిపారు. ఆనాటి యువతను ఆయన రచనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువతలో విప్లవ భావాలు, తిరుగుబాటు భావాలను పండించాయి. ఈ క్రమంలో ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాక, ఉత్తరాంధ్రలో కూడా వేలాది మంది శిష్యులు, అభిమానులు ఏర్పడ్డారు.
వర విక్రయం, చింతామణి, మధుసేవ వంటి గ్రంథాలు లేని ఇల్లే ఉండేది కాదు. ఆనాడే కాదు ఈనాడు కూడా ఆయన గ్రంథాలను అచ్చువేసిన మరుక్షణం వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా అమ్ముడుపోవడమనేది ఆయనకే చెల్లింది. ఆయన గ్రంథాలను చదివిన వారి సంఖ్యను లెక్కవేస్తే అది కొన్ని కోట్లల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఆయనను యువతీ యువకులు ఎంతగా అభిమానించారో, వృద్ధులు, సంప్రదాయవాదులు అంతగా నిరసించారు. అయినప్పటికీ ఆయన మొక్కవోని ధైర్యంతో తన సంస్కరణ కార్యకలాపాలను ముందుకు తీసుకు వెళ్లారే తప్ప ఒక్కడా వెనుకడుగు వేయలేదు. చింతామణి, వర విక్రయం, మధుసేవ నాటకాలను ఎన్నిసార్లు అచ్చువేశారో లెక్క లేదు. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఆయన గ్రంథాలకు ఇప్పటికీ డిమాండ్ ఉందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.
జి. రాజశుక