రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు గుంతలున్న రహదార్లు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గతంలో రహదార్లపైన ప్రయాణించాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, దాన్ని పోగొట్టి ఇప్పుడు మన ప్రభుత్వం రహదార్లను బాగు చేశామని, ఇప్పుడు రోడ్లు కాస్త అందంగా కనిపిస్తున్నాయని, ఇది సంతోషదాయకమన్నారు. అయితే ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని సూచించారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఇచ్చిన ప్రజంటేషన్ పైన సీఎం మాట్లాడారు. జాతీయ రహదార్లపైన కూడా తనకు ఎక్కడా గుంతలు కనిపించకూడదన్నారు. రహదార్లకు మరమ్మతులు చేయడం, రోడ్లు నిర్మించడం ఒక్కటే కాదని, వాటి నిర్వహణ కూడా నిరంతరం సమర్థవంతంగా చేయాలన్నారు. ఇప్పుడు మనం చేపట్టిన రోడ్లు నిర్మాణ పనులన్నీ కూడా నాలుగేళ్లలో పూర్తి కావాలన్నారు. అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడా గుంతలున్న రహదార్లు తనకు కనిపించకూడదన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణాలు, రైల్వే నిర్మిస్తున్న రైల్వే వంతెనల నిర్మాణాలు చేపడుతుంటుందని, కేంద్రంతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆ పనులు ప్రగతిని కూడా సమీక్షించుకోవాలని, రాష్ట్రంలో కనెక్టివిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/1941a530-d6a3-4124-b35d-1f6415c308f0-1024x451.jpg)
ఈ నెలాఖరుకు గుంతల రహిత రహదార్లు
ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రహదార్లన్నిటినీ గుంతల రహిత రహదార్లుగా మారుస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే చెప్పారు. 20,059 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చాలనే లక్ష్యంలో ఇప్పటికే జనవరి నెలాఖరుకు 14,168 కిలోమీటర్లు గుంతల రహితంగా మార్చామన్నారు. మిగిలింది కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామం నుంచి మండల కేంద్రం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు వేయాలనే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్నారు. 2026 మార్చి నెలాఖరులోపు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/892074e9-a7da-4dd7-a138-119479faea6e-1024x446.jpg)