మద్యం దుఖాణాలకు 14 శాతం మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ మాత్రం గండి పడే అవకాశం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బాటిల్ పై రూ.10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.
అంతా పారదర్శకంగానే
మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మద్యం షాపుల కేటాయింపు నుండి బ్రాండ్ల పునరుద్దరణ వరకు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. మద్యం పాలసీకి సంబందించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను అన్నింటినీ సరిదిద్దుతూ తమ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందించి అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. మద్యం షాపులకు ఏకంగా 90 వేల దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల మేర ఆధాయం వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయిస్తున్నట్టు మంత్రి కొల్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఆరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ షాపుల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయించడం జరిగిందని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారు భంగపడ్డారన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/69659a54-fa69-4990-b98b-c3d62be5cb27-1024x799.jpg)
రూ. 99కే క్వాలిటీ లిక్కర్
రూ.99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, 12 రకాల పరీక్షలు నిర్వహించిన తదుపరే షాపులకు తరలిస్తున్నామన్నారు. ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా డిపోల నుండి వచ్చే ఇండెంట్ ఆధారంగా మాత్రమే మద్యం కేటాయింపులు చేస్తున్నామన్నారు. బెల్టు షాపుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉందని, ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో ప్రతి బాటిల్‌ని మానిటర్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. బెల్టు షాపులు నిర్వహిస్తూ పట్టుబడితే, మద్యం ఇచ్చిన షాపుకు తొలిసారి రూ.5లక్షల జరిమానా విధిస్తామని, మరోసారి పట్టుబడితే ఏకంగా లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో త్వరలోనే నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన మేరకు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/a7ec8723-5a99-4a22-b1bb-79aea5926bec-1024x920.jpg)