ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొంతకాలంగా తీవ్రమైన నడునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం నుంచి కోలుకున్న ఆయన నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన(spiritual journey)కు బయలుదేరారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి బేగంపేట్ విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి కొచ్చి చేరుకున్నారు. ముందుగా ఆగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అయితే ఆకస్మాత్తుగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ఆలయాల పర్యటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, బీజేపీ తరఫున హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే ఈ పర్యటన చేపట్టారని చెబుతున్నారు. ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం సత్తా చాటుకోలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ద్వారా బలంగా పుంజుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తుందని పేర్కొంటున్నారు.