మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(Bumrah) గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. గాయం ఇంకా తగ్గకపోవడంతో బుమ్రా ట్రోఫీకి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఈ టోర్నీ కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో బుమ్రాకు కూడా సెలెక్టర్లు స్థానం కల్పించారు. అయితే అప్పటికే గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. ట్రోఫీ ప్రారంభ సమయానికి కోలుకుంటాడని భావించారు. కానీ గాయం తగ్గకపోవడంతో ఇప్పుడు జట్టుకి దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ ప్రారంభం నాటికి కోలుకుంటాడని భావిస్తున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌లో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 23న తలపడనుంది.