తిరుపతి(Tirupati) జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal)పై ఆరోపణలు చేసిన లక్ష్మీ అనే మహిళ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెక్‌బౌన్స్ కేసులో ఆమెను రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు (Jaipur police) అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను జైపూర్‌కి తీసుకెళ్లి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
కాగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర వివాదాలపై కిరణ్ రాయల్‌పై లక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద కోటి 20 లక్షలు రూపాయలు తీసుకుని ఇవ్వడంలేదని అందుకే చనిపోవాలనుకుంటున్నానని తెలిపారు. కిరణ్ మాయమాటలకు తాను మోసపోయానని వాపోయారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని.. ఎక్కడ ఆడపడుచులకు కష్టం వచ్చినా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ తనకు సహాయం చేయాలని కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో పార్టీ వ్యవహారాలకు కిరణ్ రాయల్ దూరంగా ఉండాలని జనసేన అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.