Thursday, February 13, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయిన 2,378 కోట్లు

AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురిగిపోయిన 2,378 కోట్లు

అర్హులందరికీ గృహాలు

గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖమాత్యులు కొలుసు పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని ఆయన తప్పు పట్టారు. నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం రూ.20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, ఆ నిధులు సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 2018 లో ఆవాస్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి PMAY GRAMEEN – 1.0 క్రింద 3,18,987 మంది లబ్దిదారులను గుర్తించి కేంద్ర వెబ్ సైట్లో ఫీడ్ చేశామన్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ నుండి 1,39,243 మంది లబ్దిదారులను తొలగించి వారికి అన్యాయమన్నారు. కేంద్ర పోర్టల్లో మిగిలిన 1,79,744 మంది లబ్దిదారుల్లో 1,79,060 మంది లబ్దిదారులకు 2021-22 సంవత్సరంలో కేంద్రం ఇళ్లను కేటాయించిందన్నారు. ఇంకా ఆ కేంద్ర పోర్టల్లో మిగిలి ఉన్న 684 మంది లబ్దిదారుల్లో 505 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించామన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వం పై బురద జల్లే విధంగా ప్రవర్తించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.


2014-19 మద్యకాలంలో తమ ప్రభుత్వం ఎన్.టి.ఆర్. గ్రామీణ గృహ నిర్మాణ పథం క్రింద ప్రతి గృహానికి రూ.2.50 లక్షల మేర రాష్ట్ర నిధులను మంజూరు చేయడమే కాకుండా అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మరియు పి.వి.టి.జి.లకు రూ.1.00 లక్షను అందజేశామన్నారు. గత ప్రభుత్వం ప్రతి గృహానికి కేంద్రం ఇచ్చిన రూ.1.50 లక్షలకు అదనంగా కేవలం రూ.30 వేలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.

అర్హులు అందరికీ శాశ్వత గృహ వసతి
వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవానికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృఢనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. PMAY GRAMEEN – 1.0 పథకం వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి కావాల్సి ఉందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఆ పథకాన్ని 2025 డిశెంబరు వరకూ పొడిగించారన్నారు. ఈ పథకం క్రింద తమ ప్రభుత్వం 1.15 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశామని, మిగిలిన 7.35 లక్షల గృహాల్లో 1.50 లక్షల గృహాలను ఈ జూన్ మాసాంతాని కల్లా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకున్నట్టు తెలిపారు.

పూర్తి స్థాయిలో సద్వినియోగం
PMAY GRAMEEN – 2.0 పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చిత్తశుద్దితో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం క్రింద లబ్దిదారులను గుర్తించే సర్వే ఇప్పటికే మొదలైందని, ఇప్పటి వరకూ 11,600 లబ్దిదారులను గుర్తించామన్నారు. ఈ పథకం క్రింద కేంద్రం నుండి దాదాపు 5.00 లక్షల గృహాలను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం క్రింద 50 వేల గృహాలను మంజూరు చేశామని, ఈ మార్చి మాసాంతానికి మరో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో లబ్దిదారులు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. PMAY URBAN – 2.0 లో రూ.2.50 లక్షలు, PMAY GRAMEEN – 2.0 లో రూ.1.20 లక్షలు యూనిట్ కాస్టుగా కేంద్రం నిర్థారించిందన్నారు. అయితే ప్రతి యూనిట్ కాస్టు రూ.2.50 లక్షల్లో కేంద్రం రూ.1.50 లక్షలను, రాష్ట్రం రూ.1.00 లక్షలను మంజూరు చేస్తామన్నారు. దీనికి అదనంగా ఎస్సీ లకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మరియు పి.వి.టి.జి.లకు రూ.1.00 లక్ష మరియు నేత కార్మికులకు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎస్.హెచ్.జి. గ్రూపు సబ్యులకు రూ.35 వేల ఋణాన్ని 3 శాతం వడ్డీతో ప్రభుత్వం ఇప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ. 35 వేలను రూ.1.00 లక్షకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News