ఇది రీ సర్వే కాదు ఎవరైతే సర్వేలో మిస్సయ్యారు సర్వేలో సమాచారం ఇవ్వలేదో వారు సమాచారం ఇవ్వడానికి మరొక అవకాశం ఇస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మార్చ్ మొదటి వారంలో క్యాబినెట్ సమావేశమయ్యాక ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పొన్నం వివరించారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత
42 శాతం స్థానిక సంస్థల్లో, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే కార్యాచరణ తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తమిళనాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం. ఇందుకు ఢిల్లీ స్థాయిలో తమ సర్కారు పోరాడుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్రానికి పంపుతామని, బీఆర్ఎస్, బీజేపీ ఈ విషయంలో తమ పారదర్శకత నిరూపించుకోవాలని ఆయన సవాలు చేశారు. కుల సర్వేలో మిస్సయిన వారికి అవకాశం ఇవ్వాలని బీసీ నేతలు విజ్ఞప్తి చేయటాన్ని తాము పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నందున వారికి సామాజిక న్యాయం చేసితీరుతామన్నారు. రాష్ట్ర మంత్రిగా చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది లాంటి నిర్ణయంలో తాను భాగస్వామి అయినట్టు మంత్రి అన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/9fae9d7e-febc-4ef8-b39a-da9151c50175-1024x576.jpg)
మిస్ అయిన 3.1 శాతం మంది
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేపై మరిన్ని వివరాలు స్పష్టంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకుగానూ కోటి 12 లక్షల కుటుంబాలు సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినట్టు వెల్లడించిన పొన్నం, సర్వే మిస్ చేసుకున్న దాదాపు 3.1 శాతంలో కొంత మంది తమ సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్త చేశారన్నారు. దీంతో వారి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు, ఇందులో భాగంగా ఈనెల 16 నుండి 28వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1 శాతం ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/c810ab02-901e-44d1-a6fe-8d5b69f57157-1024x576.jpg)
చారిత్రాత్మక నిర్ణయంలో నేనూ బాగమే
కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు కేశవ రావు, సహచర మంత్రులందరికీ స్ఫూర్తి ప్రదాత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపదాస్ మున్షి అందరూ కలిసి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పొన్నం అన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/d7ce1215-19d1-4efd-842f-ead5213553b3-1024x576.jpg)
బీసీల్లోనే ముస్లింలు కులాలు
గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల్లాంటి ముస్లింలకు సంబంధించిన కులాలు బీసీల్లో ఉండేవని గుర్తు చేసిన మంత్రి పొన్నం ఇది కాంగ్రెస్ కొత్తగా తెచ్చినది కాదని వివరించే ప్రయత్నం చేశారు. కాగా 1931లో స్వతంత్రం రాకముందు కుల సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు మాత్రమే జరిగిందని ఆయన సగర్వంగా ప్రకటించారు.