ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటన కోసం అమెరికా(America) చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు గడ్డకట్టే చలిలో కూడా వెల్‌కమ్ టు అమెరికా అంటూ ప్ల కార్డులు చేతబట్టి ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం అమెరికా ఇంటలిజెన్స్ డైరెక్టర్, తులసి గబ్బర్‌ని కలిశారు. ఇరు దేశాల మైత్రిపై ఆమెతో చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
అలాగే ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలకడంపై వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. “వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన నాకు గడ్డ కట్టే చలిలో కూడా ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మీటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇండియా-యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం తమ లక్ష్యమన్నారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం అమెరికా, భారత్ ఎప్పుడూ కలిసి పనిచేస్తూనే ఉంటాయని వెల్లడించారు. ఇక ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు.