ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వాన్ని ఇటు ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)..అటు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో నిలదీస్తున్నారు. ఇప్పటికే రియల్టర్ల ఆత్మహత్యలపైన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కులగణన, హోంగార్డుల జీతాలు సహా పలు అంశాలపై ప్రశ్నించారు. తాజాగా రాష్ట్రంలో తాగునీటి ఎద్ధడిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకుల్ కోడ్ గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ముందు ముందు ఎలా ఉంటుంది. సంక్షేమ పథకాల్లో ఎలాగూ కోతలు విధిస్తున్నారు, కనీసం తాగు నీటి కొరత అయినా లేకుండా చూడండి” అని కోరారు. కాగా ప్రజా సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతున్న హరీష్ రావు.. త్వరలోనే పాదయాత్రకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.