‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా ‘బేబీ’ మూవీ నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) ఎక్స్ వేదికగా కౌంటర్ పోస్ట్ పెట్టారు. ‘‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. నిజమైన ఫ్యామిలీ మ్యాన్. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా ఆయనపై ఊరికే అవాకులు చెవాకులు పేలడం, అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా పిచ్చి ఆనందం పొందటం కొందరికి అలవాటు’’ అని విమర్శించారు.
కాగా ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరు మాట్లాడుతూ.. “ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్‌ని ఒక్కోసారి అడుగుతుంటాను. దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా మన లెగసీని ముందుకు కొనసాగించాలి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. మెగాస్టార్ స్థాయిలో ఉండి ఆడపిల్లలు వద్దు అని వ్యాఖ్యానించడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.