Saturday, April 19, 2025
HomeతెలంగాణKavitha: పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం

Kavitha: పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం

ఇంతకింత చెల్లిస్తాం

అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుండడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. “మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. అందులో అన్నీ రాసుకుంటాం. ఇంతకింత తిరిగి చెల్లిస్తాం. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు. మీ లెక్కలన్నీ తీస్తాం. అన్నింటినీ మేం అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తాం” అని కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా హెచ్చరించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ వేధింపులకు గులాబీ సైనికులు భయపడబోరని తేల్చిచెప్పారు.

- Advertisement -

గురువారం నాడు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యుటీ సీఎం టీ రాజయ్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అంతకు ముందు పెంబర్తిలోనూ విలేకరులతో మాట్లాడారు.

భయపడుతున్న రేవంత్

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని, పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారని, కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని స్పష్టం చేశారు.

బిల్లని చేతులు దులుపుకుంటే

బీసీ రిజర్వేషన్లను పెంచడానికి శాసన సభలో బిల్లు ప్రవేశపెడుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్ చేశారు. బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని, దాన్ని ఆచరణ సాధ్యం అయ్యేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు ఒక్క బిల్లు కాకుండా మూడు వేర్వేరు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతం ఉందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విద్యా రంగంలో ఆ వర్గానికి 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలని, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలని సూచించారు.

బీసీల తొలి విజయం ఇదే

బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడుతామని ప్రకటించిందని, ఇది బీసీలందరి విజయమని, ఇది తొలి విజయం మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు అని అన్నారు. బిల్లును ఆమోదించిన మరుసటినాడే దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని, కానీ జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడలు వేస్తే సహించబోమని, బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు.

కుల సర్వే 15 రోజులు చేయాలి

మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ 15 రోజుల కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 60 శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఈ రీత్యా రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని, టోల్ ఫ్రీ నెంబరును విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి బొమ్మలు కాకుండా బీసీలకు ప్రయోజనం కలిగేలా ప్రచారం చేయాలని సూచన చేశారు.

అవకాశవాదం కోసమే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ హరి పార్టీ మారారని, కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని, న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కాబట్టి పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముందని వివరించారు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News