బర్డ్ ఫ్లూ నేపథ్యంతో( Bird Flu) గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తో లక్షల కోళ్లు చనిపోవడం కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు (EMRS ) చికెన్ నిలిపేశారు. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర పండ్లు, స్వీట్లు అందించాలని సూచించారు. అయితే ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్.
వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
చనిపోయిన కోళ్ళను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మనుషులకు సోకితే లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు చెప్పారు. జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గు రావచ్చు. తలనొప్పి, అలసటగా ఉంటుందని వెల్లడించారు.
శరీరమంతా నొప్పి, గందరగోళం, తీవ్ర అలసట అనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి అనిపించవచ్చు. కొంత మందికి మలబద్ధకం లేదా వాంతులు, విరేచనాలు కనిపించవచ్చు. శరీరమంతా కండరాల నొప్పితో బాధపడొచ్చు. కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు రావచ్చున్నారు. ఇలాంటి లక్షణాలుంటే సమీపంలోని వైద్యులను కలిసి సరైన చికిత్స తీసుకోవాలన్నారు.