గుమ్మడిదలను మరో లగచర్ల చేయద్దని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మద్దతు తెలిపిన హరీశ్, ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను ఆపినట్టు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని హరీష్ రావు ఆరోపించారు. రెండు సార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
