దిష్టి, నగఘోష, గాలి ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఎవరైనా మనల్ని అసూయతో లేదా ద్వేషంతో చూసినప్పుడు ఆ చూపుల ద్వారా మనపై ప్రతికూల ప్రభావం పడుతుందని మన దేశంలో కొందరు నమ్ముతారు. ఈ ప్రతికూల శక్తి ప్రభావాన్నే నరదిష్టి అంటారు. అందుకే కొత్తగా కొన్న ఇండ్లు, కారు, వాహనాలకు పూజలు చేస్తారు. నరుడి కంటికి నాపరాయి కూడా బద్దలవుతుందని పెద్దలు అంటారు. నరఘోష, ఈవిల్ ఐ, నర దిష్టిగా పిలిచే దీనిని.. మన దేశంతో పాటు చాలా దేశాల్లో నమ్ముతారు.
ఈ దిష్టి ప్రభావం వల్ల అకస్మాత్తుగా దురదృష్టం వెంటాడుతుందని, ఆరోగ్యం పాడవుతుందని.. పనుల్లో ఆటంకాలు కలుగుతాయని విశ్వసిస్తారు. దీని ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి చాలా సంస్కృతుల్లో కొన్ని ఆచారాలను పాటిస్తారు. అయితే నరదిష్టి తగలకుండా మనల్ని ఆరు సాధారణ వస్తువులు కాపాడగలవు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేవతల చిత్ర పఠాలు ప్రతికూల శక్తులను ఆపుతాయని.. చాలా మంది విశ్వసిస్తారు. చాలా మంది తమ ఇళ్లల్లో వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, హనుమంతుడు లేదా దుర్గామాత వంటి దేవుళ్ల చిత్రాలను ఉంచుతారు. ఈ దేవదేవతల చిత్రపటాలు నరదిష్టి నుంచి మాత్రమే కాకుండా అన్ని ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇష్టదైవం చిన్న చిత్రాన్ని పర్స్‌లో కూడా ఉంచుకోవచ్చు. లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉంచవచ్చు. దేవుని దీవెనలు నిత్యం హాని నుంచి సురక్షితంగా ఉంచుతాయని నమ్ముతారు.
భారతదేశంలో దిష్టి తగలకుండా కాలికి నల్లతాడు కట్టుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. దీన్ని మణికట్టు లేదా మెడ చుట్టూ కూడా కట్టుకుంటారు. రక్షణ కోసం దీనిని తలుపులకు, వాహనాలకు కూడా కడతారు. నల్ల తాడు ప్రతికూల శక్తులను గ్రహించి నిరోధిస్తుందని భావిస్తారు. దీనితో పాటు దిష్టి, ప్రతికూల శక్తులను తొలగించడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మంచి ఫలితాల కోసం ఉత్తమ కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. ఇంటి దగ్గరే తిష్ట వేసిన హానికరమైన శక్తులను తొలగించడానికి ప్రార్థనల తర్వాత రోజుకు 3-4 కర్పూర బిల్లలు వెలిగించాలి.
అంతేకాదు పంచముఖ హనుమాన్ గొప్ప రక్షణకు చిహ్నం. హనుమంతుని ఈ రూపం రాముడిని, లక్ష్మణుడిని అహిరావణుడు అనే రాక్షసుడి నుంచి రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి. పంచముఖ హనుమాన్ లాకెట్ లేదా బ్రాస్‌లెట్‌ను ధరిస్తే దుష్ట శక్తులు, హానికరమైన శక్తుల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుందని విశ్వసిస్తారు. యాలకులు కూడా శుద్ధి ఆచారాలలో ఉపయోగించే మరొక సుగంధ ద్రవ్యం. దీని సువాసన గాలిని శుభ్రపరుస్తుందని, రక్షణ కవచాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. కొన్ని యాలకులను జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవచ్చు లేదా ఇంటి గుమ్మం దగ్గర వాటిని కాల్చి రక్షణ కోసం పొగను చుట్టూ వ్యాపింపజేయాలి. భారతీయ ఆచారాలలో లవంగాల (Cloves)ను శుద్ధి, రక్షణ కోసం ఉపయోగిస్తారు. ప్రార్థనల సమయంలో లవంగాలను కాల్చడం వల్ల పరిసరాలు శుభ్రపడతాయని, ప్రతికూలతలు తొలగిపోతాయని చెబుతారు. దిష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని లవంగాలను మీ జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవచ్చు.