అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శుక్రవారం గుర్రంకొండ మండలానికి చెందిన గౌతమిపై కత్తితో పొడిచి యాసిడ్‌తో దాడి(Acid attack) చేసిన నిందితుడిని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో నిందితుడు హత్యాయత్నం చేసినట్టు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు. ఈ యాసిడ్ దాడి ఘటనలో ప్యారంపల్లెకు చెందిన గౌతమి తీవ్రంగా గాయపడిందన్నారు. నిందితుడు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేషుగా గుర్తించమన్నారు. హుటాహుటినా బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత మెరుగైన వైద్యం నిమిత్తం మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు.
ఏప్రిల్ 29న ఆ యువతికి పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ విషయం తట్టుకోలేక మనస్థాపంతో గణేష్ గౌతమిపై దాడి చేశాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కావటంతో శనివారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఖండించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
అమ్మాయిపై యాసిడ్ దాడి కేసులో ప్రేమోన్మాదిని 24 గంటలు లోపే అరెస్టు చేశామన్నారు. మహిళలపై ఎటువంటి దాడులు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
మైనర్లు బైకులునడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఆరా తీయాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు.