వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్టుతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ కూడా వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతల మాటలు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. వంశీది నీచమైన చరిత్ర అని విమర్శించారు. ఇన్నాళ్లకు వంశీ పాపం పండిందని అలాంటి వ్యక్తి బయట తిరిగితే సమాజానికి హానికరమని తెలిపారు.
వంశీ అరెస్టుతో గన్నవరం ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని బుద్దా జోస్యం చెప్పారు. దీంతో బుద్దా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.