Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్women empowerment: సాధికారికతలో సరికొత్త మలుపు

women empowerment: సాధికారికతలో సరికొత్త మలుపు

సాధికారికత విషయంలో మహిళా లోకం మరో అడుగు ముందుకు వేసింది. ఇది సాధారణమైన అడుగు కాదు. ఇది చరిత్రాత్మకమైన అడుగు. భారత వైమానిక దళం మహిళలను యుద్ధ విమానాలకు పైలట్లుగా తీసుకోవడం ప్రారంభించింది. యుద్ధ విమానాల (క్షిపణులు) యూనిట్‌కు ఒక మహిళా అధికారిని సారథిగా నియమించి, సాధికారికతలో కొత్త చరిత్రకు నాంది పలికింది. పంజాబ్‌లో భారతీయ గగన తలంలో చొచ్చుకు వచ్చే శత్రు విమానాలను ఎదుర్కోవడం ఈ యూనిట్‌ బాధ్యత. లూధియానాకు చెందిన షాలిజా ధామిని గ్రూప్‌ కెప్టెన్‌గా చూసి మహిళా లోకం ఇప్పుడు ఎంతగానో గర్వపడుతోంది. ఆమె 2003లో హెలికాప్టర్‌ పైలట్‌గా వైమానిక దళంలో ప్రవేశించారు.ఆ తర్వాత నుంచి ఆమె తన రంగంలో అంచెలంచెలుగా పురోగతి సాధించడం తప్ప వెనుకడుగు వేయడమంటూ జరగలేదు.
ఇంతవరకూ సుమారు 2,800 గంటల ఫ్లైయింగ్‌ అనుభవం ఉన్న ధామి క్వాలిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. అంతేకాదు, ఇటీవలి వరకు పశ్చిమ రంగంలో ఒక కీలకమైన హెలికాప్టర్‌ యూనిట్‌కు ‘సెకండ్‌ ఇన్‌ కమాండ్‌’గా పనిచేశారు. మహిళా సైనికులకు లింగ వివక్ష అనేది ప్రధాన అడ్డంకిగా మారిన ఈ రోజుల్లో ధామి ఏకంగా ఒక యుద్ధ క్షిపణుల యూనిట్‌కు గ్రూప్‌ కెప్టెన్‌గా మారడం దేశ చరిత్రలో నిజంగా ఒక పెద్ద మైలు రాయే. నిజానికి, మహిళా సైనికులకు రక్షణ రంగంలో అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా విద్య, వైద్య, న్యాయపరంగా వీరికి పురోగతి అనేది ముళ్లబాటే అవుతుంది. శత్రు దేశాల సైన్యంతో పోరాడడం కంటే ఎక్కువగా రక్షణ దళాలలోనే మహిళలు ప్రతికూలతల మీదా, వ్యతిరేకతల మీదా, అవరోధాలు, అవమానాల మీదా పోరాడాల్సి ఉంటుంది. ఎంత చేసినా వారికి చివరికి మిగిలేది లింగ వివక్ష మాత్రమే.
వారి సమస్యలను, వివాదాలను పరిష్కరించడానికి ప్రతిసారీ సుప్రీంకోర్టు వారికి అండగా నిలబడడం జరుగుతుంటుంది. మహిళా సైనికులకు ఉన్నత పదవులు అప్పగించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ప్రభుత్వం గానీ, రక్షణ శాఖ గానీ అడ్డుపడుతుండేది. చివరికి 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కల్పించుకుని, ప్రభుత్వ ప్రతిఘటన కలచి వేస్తోందంటూ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. చాలామంది సైనికులు (పురుషులు) గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కనుక వారు మహిళా సైనికులతో, మహిళా అధికారులతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారని, అభ్యంతర పెడుతున్నారని ప్రభుత్వం వాదించింది. సైనికులకు ఇందుకు అవసరమైన మానసిక శిక్షణ కరవు అవుతోందని కూడా తెలిపింది. అయితే, ఈ వాదనతో ఏకీభవించని సుప్రీం కోర్టు సైనికుల దృష్టికోణాన్ని మారినా, మారకపోయినా మహిళా సైనికాధికారులను నియమించాల్సిందేనని స్పష్టం చేసింది. రక్షణ రంగంలో సమానత్వాన్ని పాటించాల్సిందేనని, ఈ విషయంలో కుంటి సాకులు చెప్పి ప్రయోజనం లేదని కూడా వ్యాఖ్యానించింది.
అయితే, మహిళల పోరాట పటిమను, యుద్ధ నైపుణ్యాలను రక్షణ శాఖ, అందులోనూ వైమానిక దళం ఏనాడూ శంకించలేదు. ముప్ఫయ్‌ ఏళ్ల క్రితం నుంచే మహిళలను సైన్యంలోకి రిక్రూట్‌ చేసుకోవడం మొదలుపెట్టింది. పైగా వారికి కూడా ఇతర అధికారులతో పాటే ప్రమోషన్లు ఇచ్చింది. బాధ్యతలు పెంచింది. ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం కూడా జరిగింది. యుద్ధ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఆధునిక శిక్షణ కూడా అందజేస్తోంది. కాగా, వైమానిక దళం మాదిరిగానే నౌకాదళం, ఇతర సైనిక దళాలు కూడా మహిళలను రిక్రూట్‌ చేసుకోవడాన్ని ఎక్కువ చేశాయని, పూర్తి స్థాయిలో సమానత్వాన్ని పాటిస్తూ లింగ వివక్షకు స్వస్తి చెబుతున్నాయని రక్షణ శాఖ తెలిపింది. విమెన్‌ డిఫెన్స్‌ ఆఫీసర్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలియజేస్తూ ఇటీవలే రక్షణ శాఖ సుమారు వంద మంది మహిళా కల్నల్‌లను తీసుకుందని కూడా అది వెల్లడించింది. నౌకాదళం కూడా యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియమించడం మొదలైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News