ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు(Chandrababu) హెచ్చరించారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పిస్తూ ప్రమాణం చేశారు. పట్టణాల్లో 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని.. అక్టోబరు 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసినప్పటికీ చెత్తను క్లీన్ చేయలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో పేరుకుపోయిన చెత్తతో సంపదను సృష్టిస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరంలో రూ.340 కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో 640 టన్నుల వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సంపద సృష్టితో వచ్చే ఆదాయం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.