ప్రశ్నాపత్రం చూడగానే భయపడకూడదని.. సహచర విద్యార్థులతో మన చదువును అస్సలు పోల్చుకోవద్దని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అర్ధరాత్రి వరకు చదవడం అస్సలు మంచిది కాదని, రాత్రి 10.30 గంటలకు నిద్రపోయి 5.30 గంటలకు నిద్ర లేవాలంటూ నిరంజన్ అన్నారు.
ప్రతి రోజు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలని, అల్పాహారం తీసుకున్న తర్వాతనే చదవాలని,
పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలని కూడా మంత్రి ఉద్భోదించారు. చదువుకునేటప్పుడు సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్ ఆఫ్ పెట్టాలని, పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్ ఉందో లేదో సరిచూసుకుని, ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నారు. ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని వెళ్లి చూసుకోవాలని, పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్‌లు, పెన్సిల్, రబ్బర్ ముందురోజు సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్రాలకు కనీసం అరగంట ముందైనా వెళ్లి, హాల్‌టికెట్ నంబర్లు చూసుకోవాలని,
వేసవి కాలం దృష్ట్యా అందరూ ఉదయం పూటనే టిఫిన్ తిని, వాటర్ బాటిల్‌ను వెంట తీసుకువెళ్లాలని ఆయన చాలా విషయాలు చెప్పారు. రేపటి నుండి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఒక ప్రకటనలో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.