సీనియర్ నటి కృష్ణవేణి(Krishnaveni) మృతిపై నందమూరి బాలకృష్ణ(Balakrishna) తీవ్ర సంతాపం తెలిపారు. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన ఆమె మృతి చెందడం బాధాకారమన్నారు. ‘మన దేశం’ లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి ఆమె కృషి చేశారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కృష్ణవేణిని ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో ఘనంగా సత్కరించామని గుర్తుచేశారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుటుంబ సభ్యులకు బాలయ్య సానుభూతి తెలిపారు.
ఇక నందమూరి రామకృష్ణ కూడా కృష్ణవేణి మృతికి నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర సీమకు ఇవాళ చీకటి రోజు అన్నారు,. ఎన్టీఆర్‌ని ‘మన దేశం’ చిత్రంతో వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి కృష్ణవేణమ్మ స్వర్గస్తులవడం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందన్నారు. భౌతికంగా లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమ కుటుంబంపై ఉంటాయని ఆశిస్తున్నామని తెలిపారు. నందమూరి కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.