తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో పాటు పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, మహమూద్ అలీ,వీ.శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారిలతో కలిసి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.

భారీ కేక్ తెచ్చిన తలసాని
మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.అంతకుముందు ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పలువురు ప్రముఖులతో కలిసి తెలంగాణ తల్లి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్, దాని పరిసరాలు “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”, “హ్యాపీ బర్త్ డే కేసీఆర్ గారు హ్యాపీ బర్త్ డే, హ్యాపీ బర్త్ డే”,”లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ గారు లాంగ్ లివ్”అనే హోరెత్తింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు,సత్యవతి రాథోడ్,నవీన్ కుమార్ రెడ్డి,మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖరరెడ్డి,బాల్క సుమన్,మాలోతు కవిత, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పార్టీ ప్రముఖులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్,రాకేష్ కుమార్, ఉపేంద్రాచారిలతో పాటు పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
