యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)కు ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దంపతులు వెళ్లారు. షాహి స్నానఘట్టంలో పుణ్య స్నానం ఆచరించారు. కుంభమేళాలో దేవుడి ఆశీస్సులు తీసుకున్నట్లు లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం 3.40 గంటలకు వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇక సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనమవుతారు.
కాగా జనవరి 13 నుంచి ప్రారంభమైన మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు మాత్రమే కుంభమేళా జరగనుంది. 144 ఏళ్లకు ఓసారి వచ్చే కుంభమేళా కావడంతో ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.