కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులందరికీ వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోలేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియ చాలా రోజులుగా కొనసాగుతున్న విషయం విధితమే. దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాల వద్ద జనాలు గుమికూడుతున్నారు. ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ చాలా మంది మీ సేవలో మళ్లీ దరఖాస్తులు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.