Saturday, February 22, 2025
Homeనేషనల్Mahakumbh: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. నెల రోజుల్లో ఏడోసారి

Mahakumbh: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. నెల రోజుల్లో ఏడోసారి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలోని సెక్టార్‌-8 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

తొలుత సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్‌లో ఉన్న గణేష్ ధామ్ ఉజ్జయిని ఆశ్రమం బాబా త్రిలోచన్ దాస్‌లో ఖాళీగా ఉన్న టెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కానీ అప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పోలీస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగిందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపారు. సాధువు శిబిరంలో అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని చెప్పారు.

కాగా మహాకుంభమేళాలో అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి. 2025 జనవరి 19న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. గీతా ప్రెస్ క్యాంప్ అగ్నిప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 150కి పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. జనవరి 30న ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. ఫిబ్రవరి 7న శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్‌ 18లో మంటలు చెలరేగాయి. ఇక ఫిబ్రవరి 13న కూడా మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.

ఫిబ్రవరి 15న సెక్టార్ 18లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 17న సెక్టార్ 8లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18లోని బజరంగ్‌దాస్ మార్గ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News